Saturday, June 12, 2010

నా లైబ్రరీలో 'దేవాలయం'


ఇవాళ పొద్దున్న టీవీ పెట్టాను. తేజ టీవీలో శోభన్ బాబు కనిపించేసరికి నా చూపులు స్క్రీన్ మీదే ఆగిపోయాయి. నాకు ఆయనంటే చాలా ఇష్టం. నటుడుగానే కాదు, వ్యక్తిగా కూడా. ఎన్నో విషయాల్లో ఆయనను ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది. నేను అంతగా అభిమానించే శోభన్ బాబు సినిమా అనేసరికి పనులన్నీ పక్కన పెట్టి టీవీకి అతుక్కుపోయాను. ఇంతకీ ఆ సినిమా పేరు చెప్పనేలేదు కదూ... దేవాలయం. టీవీ ముందు నుంచి లేవనివ్వకపోవటానికి శోభన్ బాబు ఒక కారణమైతే, ఆ సినిమా కధనం అత్యంత ఆసక్తికరంగా వుండటం మరో కారణం.

పూజారిగా సోమయాజులు తనదైన స్టైల్లో నటించారు. నాస్తికుడైన కొడుకు (శోభన్) ను చూసి భాధపడే తండ్రిగా, దైవం పైనే భారం వేసి బతుకీడ్చే భక్తుడిగా ఆయన నటన చాల బాగుంది. దేవుడిని సాటి మనిషిలోనే చూడాలని, సాటి మనిషిని ప్రేమించి, ఆపదలో చేయి అందించటమే నిజమైన దైవత్వమని నమ్మే వ్యక్తీ శోభన్ బాబు. తండ్రీ కొడుకుల మధ్య భావ వైరుధ్యం కారణంగా నలిగిపోయే అన్నపూర్ణ, తన నాట్యంతో శివుడిని కొలిచే విజయశాంతి, ఆమెను పెంచిన తండ్రిగా, అపర భక్తుడిగా కనిపించే పీఎల్ నారాయణ, గుడి మాన్యాలను గుటకాయ స్వాహా చేసే దుర్మార్గుడిగా రావు గోపాలరావు... ఇలా ఎవరి పాత్రల్లో వారు ఇమిడిపోయారు. అందరికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శోభన్ బాబు గురించి. మొదట్లో నాస్తికుడిగా కనిపించే ఆయన, కొన్ని పరిస్తితుల తండ్రి స్తానంలో పూజారిగా బాధ్యతలు చేపడతారు. ఇక అక్కడనుంచి ఆయన నటనా కౌశలం ఆకాశాన్ని అంటుతుంది. పూజారిగా ఆలయ బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తూనే సమాజంలో, చుట్టూ జరుగుతున్నా అన్యాయాలను నిలదీసే సన్నివేశాల్లో ఆయన డైలాగ్ డెలివరీ, హావభావాలు సింప్లీ సూపర్బ్. రావు గోపాలరావు స్టైల్ ఆఫ్ విలనిజం మామూలే. విజయశాంతి డాన్సు స్పెషల్ అట్రాక్షన్. ఇక పీఎల్ నారాయణ తన నతనతోడైలాగులతో ఊపిరి ఆడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసేసాడు.
మనిషి మనిషిని ప్రేమించకుండా దేవుడికి పూజలు చేసినా వ్యర్ధమని చాలా అర్ధవంతంగా చూపించారు. ఈ సినిమాకి అసలైన బలం డైలాగ్స్. సూటిగా మనసును తాకేలా సంభాషణలు రాసిన ఎం.వి.ఎస్. హరినాధరావుకి హాట్సాఫ్ చెప్పాలి. ప్రతి సన్నివేశంలో ఆయన పలికించిన పదునైన మాటలు ప్రేక్షకుల హృదయాలకు గుచ్చుకుంటాయి. ప్రతి మాటలోనూ పలికించిన బరువైన భావాలు చాలాసేపు విడవకుండా వెంటాడతాయి. మనుషుల మనస్తత్వాలను నిలదీస్తూ సంధించిన ప్రశ్నలు పలు ఆలోచనలను రేకెత్తిస్తాయి. చక్కని కథ, ఆకట్టుకునే కధనం, ఆలోచింపజేసే సంభాషణలు, అలరించే చక్రవర్తి సంగీతం... అన్నీ కలగలసిన ఈ సినిమా నా వీడియో లైబ్రరీలో చేరిపోయింది.

అయితే ఎందుకో నాకు క్లైమాక్స్ నచ్చలేదు. హింస పెచ్చుమీరిపోతే దానిని అణచటానికి దేవుడే మరో అవతారంలో రాక తప్పదని తేల్చేసారు. రావు గోపాలరావు దుష్టత్వాన్ని అంతమొందించటానికి హీరో కత్తి పట్టేలా చేసారు. అక్కడే ఎందుకో నేను రాజీ పడలేకపోయాను. మార్పును చూపించి వుంటే బాగుండేదని అనిపించింది. దేవాలయం ప్రస్తుత పరిస్తితులను గమనిస్తే ఒక రకంగా ఆ ముగింపు కరక్టే అని కూడా అనిపిస్తుంది. ఎల్లలు లేకుండా పెరిగిపోయిన పాపాన్ని అంతమొందించటం ఆ దేవుడి వాళ్ళ తప్ప ఎవరివల్ల కాదేమోనని కూడా అనిపిస్తుంది. అందుకే నేను కూడా ఆ ముగింపుని తర్వాత యాక్సెప్ట్ చేసేసాను. ఒక మంచి సినిమా చూసిన అనుభూతితో ఆఫీసుకు బయలుదేరిపోయాను.



1 comment:

  1. A movie Nice and Entertainment movie thanks for post this movie please post download links too.

    Telugu Cinema

    ReplyDelete